Kerala Rtd. IAS B. Srinivas at GDC GNP 13.04.23

దేశంలో పెరుగుతున్న ఆర్థిక , సాంఘిక అసమానతలను తొలగించడంపై వెంటనే దృష్టిసారించాల్సి ఉందని కేరళ విశ్రాంత ఐ. ఏ. ఎస్. అధికారి బండ్ల శ్రీనివాస్ అన్నారు. గణపవరం చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో “సామాజిక అంశాలు – అధ్యయనం – ఆచరణ” అంశపై గురువారం జరిగిన సదస్సులో శ్రీనివాస్ ముఖ్యవక్తగా పాల్గొన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఇంటర్నల్ క్వాలిటీ అష్యూ రెన్స్ విభాగం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు ప్రిన్సిపాల్ డాక్టర్ పాకలపాటి నిర్మలాకుమారి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధి బండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఒకశాతం సంపన్నుల చేతిలో 43 శాతం సంపద పోగుపడుతోందని , 50 శాతం ప్రజలకు 2.3 శాతం సంపద మాత్రమే చేరుతున్నదని , అదే సమయంలో 10 శాతంగా ఉన్న అత్యంత సంపన్నులైన వారినుండి 4 శాతం జీఎస్టీ వసూలు కాగా ,అట్టడుగున ఉన్న 50 శాతం ప్రజల నుండి 64 శాతం జి ఎస్టీ వసూలు అవుతోందని వివరించారు. ఈఅసమానతలు దేశంలో తీవ్ర సమస్యలకు దారితీస్తున్నాయని శ్రీనివాస్ అన్నారు. దేశంలో ఒక వంక ఆర్థికాభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఇంకా 60 ,70 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని శ్రీనివాస్ అన్నారు. అంతరాలను తొలగించాలని , లేనిపక్షంలో సామాజిక సంక్షోభాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులు మారకపోతే జనాభా పరంగా దేశానికి ఉన్న సానుకూల పరిస్థితిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఉన్నత ప్రమాణాలవిద్య , అందరికీవైద్యం , నైపుణ్యాలు, నిరుద్యోగం, పౌష్టికాహారలోపం , వలసలు ,అందరికీ ఉపాధి , ఉత్పాదకత వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయనీ వాటిని పరిష్కారం చేయడంపై దృష్టి సారించాలని బి. శ్రీనివాస్ సూచించారు. విద్యార్థులు. తమ చదువులతో పాటు సామాజిక అంశాలను అధ్యయనం చేయాలని , వాటి పరిష్కారంలో తమ వంతు కృషి చేయాలని కోరారు. విద్యార్థుల్లో శాస్త్రీయదృక్పధం, తప్పులను ప్రశ్నించే తత్వం ఉండాలని బండ్ల శ్రీనివాస్ సూచించారు.

ప్రముఖ సామాజికవేత్త , “దారిదీపం” పత్రికా సంపాదకుడు డి.వి.వి.ఎస్. వర్మ మాట్లాడుతూ విద్యార్థులు తమ చుట్టూ సమాజంలో కనిపించే జీవన వాస్తవాలను అధ్యయనం చేయాలని సూచించారు. ప్రపంచాన్ని మార్చడానికి చేసే ప్రయత్నం స్థానికంగానే ప్రారంభం కావాలని అన్నారు. మన చుట్టూ జీవితంలో కనిపించే సామాజిక ఆర్థిక పరిస్థితులను , వాటి వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలని కోరారు. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు లో విద్యార్థులు చేయదగిన కొన్ని పరిశీలనా అంశాలను వర్మ వివరించారు . ప్రాజెక్టు అమలులో తమవంతు సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయకార్యదర్శి డి. సోమసుందర్ మాట్లాడుతూ సంచలనాలకోసం మీడియాలో చెడుకు లభిస్తున్న ప్రాచుర్యం చూసి సమాజంలో మంచిలేదనే భావనకు రావద్దని హితవు పలికారు. అత్యధిక ప్రజానీకం నీతి మంతులేనని , కష్టాల్లో ఉన్నవారికి సాయపడే ఔదార్యం ఉన్నవారేనని సోమసుందర్ అన్నారు. సానుకూల దృక్పథంతో విద్యార్థులు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు అమలులో పాల్గొనాలని , కోరారు.

ప్రిన్సిపాల్ డా.పి.నిర్మలా కుమారి మాట్లాడుతూ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టును విజయవంతం చేయడంలో విద్యార్థులు , మెంటార్లు కలిసి కృషిచేసి మంచిఫలితాలు సాధించాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ పి. మధురాజు, ఐ.క్యు.ఏ.సి. కన్వీనర్ డా.టి. అక్కిరాజు , మహిళా సాధికారిత విభాగం కన్వీనర్ డా. కే.స్వరూపరాణి, తెలుగు అధ్యాపకులు డా.జి.వి.రమణ, బోటనీ అధ్యాపకులు డా. చైతన్య, కెమిస్ట్రీ అధ్యాపకులు నండూరి శ్రీనివాస్ …తదితరులు మాట్లాడారు. షుమారు 140 మంది విద్యార్థులు మరియు అన్ని విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. Courtesy: Sri D. Somasunder