International Women’s Day 07.03.2023

INVITATION

గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో

(Sri D. Somasunder, Vice President, AITUC, attended the event as a Special Guest. With due thanks, his report of the event is given here as it is.)

2023 మార్చ్ 7.. ఉదయం 9.30… మహిళా దినోత్సవం లో ….

పశ్చిమగోదావరిజిల్లా గణపవరం!

చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆవరణలో…!

అప్పటికే కళాశాలకు వచ్చిన విద్యార్థినులు రంగు రంగుల చాక్ పీస్ లతో , పూలతో నేలపై స్వాగత అలంకరణలు చేస్తున్నారు!

కొందరు విద్యార్థినులు “వాల్ పెయింటింగ్” చేస్తూ కనపడ్డారు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాల నిర్వహించిన “వాల్ పెయింటింగ్ ” పోటీలలో భాగం గా తాము పెయింటింగ్ లు వేస్తున్నామని పిల్లలు చెప్పారు!

సమాజంలో మహిళ ప్రాముఖ్యం , మహిళా స్వేచ్ఛ , జెండర్ సమానత్వం , వంటి థీమ్ లతో పిల్లలు వేసిన పెయింటింగులు చూస్తూ పిల్లల సృజనాత్మక ఆలోచనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను!

నారాకను గమనించిన
చిరకాలమిత్రులు వైస్ ప్రిన్సిపల్ పి.మధురాజు గారు , కళాశాల ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ కన్వీనర్ డా.టి.అక్కిరాజు గారు , కళాశాల విమన్ ఎంపవర్ మెంట్ సెల్ కన్వీనర్ , మా మేడమ్ అక్కకూతురు డా.కే.స్వరూపరాణి నాకు స్వాగతం పలికారు!

కళాశాల అంతా కలియతిరుగుతూ విశాలమైన క్రీడా మైదానాన్ని చూసి మూర్తిరాజు గారిని తలచుకున్నాను!

1952 నుండి 1978 వరకూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా వరసగా ఎన్నికైన మూర్తిరాజు గారు , రాష్ట్రమంత్రిగా గాంధేయవాదిగా , సర్వోదయవాదిగా రాష్ట్రప్రజలకు చిరపరిచితులు!

అయితే వాటన్నిటినీ మించి ఆయన విద్యాదాతగా చేసిన అసాధారణ కృషి చారిత్రాత్మకమైనది!

పశ్చిమగోదావరి జిల్లాలో , హైద్రాబాదు లో లేపాక్షి లో మొత్తం 54 హైస్కూళ్లను 5 జూనియర్ కళాశాలలను , 5 డిగ్రీ కళాశాలలను , మూడు సంస్కృత కళాశాలలను , ఒక వ్యాయామ శిక్షణా కళాశాల ను ఆయన స్థాపించారు!

వాటన్నిటినీ గ్రామీణ ప్రాంతాలలో స్థాపించడం ఒకవిశేషం!

వాటన్నిటికీ జాతీయ ,అంతర్జాతీయ నాయకుల పేర్లు పెట్టడం ఆయన ఆలోచనలలోని బహుళత్వానికి రుజువు!

కొన్నిస్కూళ్లకు , హాస్టళ్లకు విభిన్న రంగాలలో విశేష కృషిచేసిన మహిళల పేర్లు పెట్టడాన్ని బట్టి మహిళల భాగస్వామ్యంపై మూర్తిరాజు గారికి ఉన్న గౌరవం అర్థం అవుతుంది!

అన్ని విద్యాసంస్థలు స్థాపించినా మూర్తిరాజు గారు తనపేరు ఎక్కడా పెట్టుకోలేదు !

తనతండ్రిగారి పేరిట స్థాపించిన చింతలపాటి బాపిరాజు ధర్మసంస్థ పేరుతోనే అన్ని విద్యాసంస్థలు నడిచాయి!

గణపవరం డిగ్రీ కళాశాలకు మాత్రం ఆయన పేరు ఆతర్వాత కాలంలో ఎప్పుడు పెట్టారో నాకు తెలియదు!

మానాన్నగారు స్వాతంత్ర్య సమర యోధులు , దూసనపూడి విరాటరాజు గారు , మూర్తిరాజు గారు ఫస్ట్ ఫారం నుండి , ఫిఫ్త్ ఫారం వరకూ హైస్కూల్ విద్యలో సహాధ్యాయులు!

వారిద్దరిది ఒకే నియోజకవర్గం!

నేను కూడా పాత్రికేయుడిగా మూర్తిరాజు గారిని ఓ ఇరవై ఏళ్లపాటు తరచుగా కలుస్తూ ఉండేవాడిని!

అందుకే ఆయన పేరిట ఉన్న డిగ్రీ కళాశాల నుండి ఎప్పుడు ఆహ్వానం వచ్చినా వెళ్ళడం నాకు సంతోషం అనిపిస్తుంది!

అదో నోస్టాల్జియా నాకు !

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతున్నాం మీరు గౌరవఅతిథిగా రావాలని కళాశాల కోరగానే వెళ్ళాను!

పైగా కళాశాల ప్రిన్సిపల్ డా. పాకలపాటి నిర్మలాకుమారి గారు కూడా చిరకాల పరిచితులు !

ముఖ్యఅతిథిగా ఏలూరు నుండి విశ్రాంత జిల్లాజడ్జి అడబాల లక్ష్మి వచ్చారు!

మరో ముఖ్యఅతిథిగా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ నాణ్యతా నియంత్రణా విభాగం రాష్ట్ర సమన్వయకర్త కే. విజయకుమారి వచ్చారు!

అనుకోని అతిథిగా గణపవరం ఎంపీడీవో జ్యోతిర్మయి హాజరయ్యారు!

కళాశాల విమన్ ఎంపవర్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఆద్యంతం
ఉత్సాహపూరితంగా జరిగింది!

సదస్సు ప్రారంభం అవుతున్నట్లు పిల్లలు వచ్చి పిలిచారు!

ఈ సంవత్సరం మహిళాదినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన “డిజిట్ ఆల్ – ఇన్నోవేషన్ ,టెక్నాలజీ ఇన్ జెండర్ ఈక్వాలిటీ ” థీమ్ ను సభావేదిక బ్యాక్ డ్రాప్ గా విద్యార్థులు బ్లాక్ బోర్డ్ పై చిత్రీకరించారు!

అది కూడా ఆసక్తికరంగా ఉంది!

ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం అయిన గణపవరంలో డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఐ.రా.స. థీమ్ పరిచయం అయ్యిందంటే విస్మయానికి గురయ్యాను!

కమ్యునికేషన్ సామర్థ్యాన్ని , పిల్లలు దాన్ని వినియోగిస్తున్న తీరును చూసి సంతోషపడ్డాను !


ఇద్దరు అద్భుత మహిళల ప్రసంగాలు!


మహిళల రక్షణకోసం ఏర్పాటు చేసిన చట్టాలను అవగాహన చేసుకుని వాటి అమలుకోసం కృషి చేయాలని విశ్రాంత జిల్లాజడ్జి శ్రీమతి అడబాల లక్ష్మి పిలుపు ఇచ్చారు!

మహిళల హక్కులకోసం జరిగిన ఎన్నో పోరాటాల నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని లక్ష్మిగారు

వ్యాపార ప్రకటనల కోసం ప్రసార మాధ్యమాలు , కార్పొరేట్ సంస్థలు మహిళాదినోత్సవాన్ని వాడుతున్న తీరును చూస్తే అదే మహిళా దినోత్సవం అనుకునే ప్రమాదం ఉందని అసలు మహిళా దినోత్సవం ఎలా పుట్టిందో , దాని స్ఫూర్తి ఏమిటో అవగాహన చేసుకోవాలని లక్ష్మి కోరారు!

ప్రపంచవ్యాప్తంగా మహిళలకు ఆర్థిక, రాజకీయ ,సామాజిక హక్కులు కావాలని ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు!

సంప్రదాయాలకు ,కుల మతాలకు నెలవైన భారతదేశంలో మహిళా హక్కులు అంత తేలికగా రాలేదని ఎందరో సంఘసంస్కర్తలు రెండువందల సంవత్సరాలపాటు చేసిన నిరంతర పోరాటాలతో కొన్ని మార్పులు సాధించారని తెలిపారు!

బాబా సాహెబ్ అంబేద్కర్ దళితుల హక్కులతో పాటు మహిళా హక్కుల పరిరక్షణ కోసం చేసినకృషితో మరిన్ని హక్కులు వచ్చాయన్నారు!

రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్ లోనూ , ఐపిసి , సి.ఆర్పిసి , లలో మహిళల రక్షణకోసం పొందుపరిచిన అనేక అంశాలను శ్రీమతి లక్ష్మి సోదాహరణంగా వివరించారు!

అయితే కేవలం చట్టాలవల్లనే అన్ని మార్పులూరావని , సమాజపు ఆలోచనాధోరణిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు!

అందుకోసం ఇలాంటి సదస్సులు మరిన్ని జరగాల్సిన అవసరం ఉందని అన్నారు!

మరో ముఖ్యఅతిధి శ్రీమతి కే. విజయ కుమారి మాట్లాడుతూ మహిళలు కేవలం అక్షరాస్యులయినంత మాత్రాన సరిపోదని వారు “విద్యావంతులు” కావాలని, సమాజంలోని విభిన్న అంశాలను అవగాహన చేసుకోవాలని విద్యార్థులకు పిలుపు ఇచ్చారు!

ఆలోచనా పరిధిని విస్తరించుకోడమే నిజమైన సాధికారిత అవుతుందని శ్రీమతి విజయకుమారి స్పష్టంచేశారు!

విద్యార్థినులు చదువుపూర్తిచేసి సొంతంగా తమ కాళ్ళమీద నిలబడటం ముఖ్యమని అన్నారు!

ఆతర్వాతనే కుటుంబబాధ్యతలు చేపట్టడం మంచిదన్నారు !

విద్యార్థినులు స్వేచ్ఛగా ఉండటం అవసరమేనని అయితే వారు తమ సేచ్చను అందుకు గల పరిమితులను బ్యాలెన్స్ చేసుకోవాలని సూచించారు!

విద్యార్థినులు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని , అందుకు తోటి విద్యార్థులు తోడ్పాటు ఇవ్వాలని అన్నారు!

గోదావరి జిల్లాకు చెందిన న్యాయమూర్తి అడబాల లక్ష్మి వివాహం అయ్యకనే లా చదివి , పరీక్షలు రాసి మెజస్ట్రేట్ గా ఎంపికయ్యారు!

ఆ తర్వాత పలు జిల్లాల్లో పనిచేశారు!
జిల్లాజడ్జి స్థాయికి ఎదిగారు!

గత సంవత్సరం రిటైర్ అయిన ఆమె ఏలూరులో ఉచిత న్యాయసలహా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు !
దానికి ఆమెభర్త , న్యాయవాది , పి.పి.శాస్త్రి సహకారం అందిస్తున్నారు!

ఈ సదస్సుకు శాస్త్రి కూడా హాజరయ్యారు!

ఆమె ప్రసంగం గోదావరి నిండు ప్రవాహం మాదిరి గంభీరంగా కొనసాగింది!

స్వేచ్ఛను కోరుకునే వారు జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం , నియంత్రించు కోవడం అవసరమని లక్ష్మిగారు గట్టిగా నొక్కి చెప్పారు!

రాయలసీమ కు చెందిన విజయగారు బీటెక్ సివిల్ చదివి 22 వ ఏటనే పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో ఏ.ఈ. గా ఉద్యోగంలో చేరారు!

ప్రస్తుతం సూపరింటెన్ డెంట్ ఇంజనీర్ గా క్వాలిటీ కంట్రోల్ లో పనిచేస్తున్నారు!

రాయలసీమ భాషా నుడికారాలు ఉపయోగిస్తూ దూకే జలపాతంలా సాగిన ఆమె ప్రసంగంలో బతకడం కోసం , చదువుల కోసం , ఉపాధి కోసం రాయలసీమ కుటుంబాలు పడ్డకష్టాలు ప్రతిధ్వనించాయి !
ఇద్దరు ఆడపిల్లల తల్లి అయిన విజయకుమారి గారు తన పిల్లలిద్దర్నీ స్వతంత్రంగా పెంచామని , హైస్కూల్ రోజుల్లోనే చదువుకోసం కెనడా పంపించామని చెప్పారు!

ఆమెభర్త విజయ్ వర్ధన్ గారు కూడా సదస్సులో పాల్గొన్నారు!

ఆమె ప్రసంగాన్ని శ్రద్ధగా రికార్డుచేస్తూ కనిపించారు!

నా ప్రసంగం వంతు వచ్చాక
విశిష్టమైన ఇద్దరు వక్తల వ్యక్తిత్వాలను , కళాశాల విద్యార్థులు వేసిన పెయింటింగులను అభినందించకుండా ఉండలేకపోయాను!

ఐ.రా.స. ప్రకటించిన థీమ్ గురించి క్లుప్తంగా విద్యార్థులకు వివరించాను!

శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతపురోగతి సాధించినా మహిళల పట్ల వివక్ష పోవడంలేదని , డిజిటల్ సాంకేతికతలో సైతం వ్యత్యాసాలు, అసమానతలు , కొనసాగుతున్నాయని చెప్పాను!

శాస్త్ర సాంకేతిక విద్యలో మహిళలు తగిన ప్రాతినిధ్యం ఇంకాపొందలేదని , ఇంజనీరింగ్ పట్టభద్రులలో మహిళలు 28 శాతమే ఉన్నారని , సాంకేతిక ఉద్యోగాల్లో మహిళల శాతం 32 మించలేదని , కృత్రిమమేధకు సంబంధించిన సిస్టమ్స్ లో సైతం మహిళా వ్యతిరేక ధోరణులు కనిపిస్తున్నాయని ఐ.రా.స. హెచ్చరించిన సంగతిని గుర్తుచేశాను!

సాంకేతికతలో జెండర్ సమానత్వం కోసం పోరాడాలని ఐక్యరాజ్య సమితి పిలుపు ఇచ్చిందని కూడా వారికి చెప్పాను !

ప్రిన్సిపాల్ పాకలపాటి నిర్మలా కుమారి మాట్లాడుతూ విద్యార్థులలో వివిధ అంశాలపై అవగాహన పెంపొందించేందుకు తమ కళాశాలలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు!

ఎంపీడీవో జ్యోతిర్మయి మాట్లాడుతూ మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని , పథకాలు కూడా మహిళలకే అందిస్తున్నదని వివరించారు!

తమ తండ్రిగారు ఇంట్లో ముగ్గురు మగపిల్లలకు జ్యోతిర్మయి , కిరణ్మయి , హిరణ్మయి , అనే పేర్లు పెట్టారని , అంతకంటే మహిళా సాధికారిత ఏముంటుందని ఆయన ప్రశ్నించారు !

విమన్ ఎంపవర్ మెంట్ సెల్ కన్వీనర్ డా.కే. స్వరూపరాణి మాట్లాడుతూ విద్యార్థిదశ నుండి సాధికారిత అనే అంశంపై అవగాహన అవసరమని అన్నారు!

విభిన్న సామాజిక అంశాలపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని , కళాశాలలో జరుగుతున్న కార్యకలాపాల్లో ఎక్కువమంది పాల్గొనాలని విద్యార్థులను కోరారు!

కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి. మధురాజు , నాక్ ఇంటర్నల్ క్వాలిటీ విభాగం కన్వీనర్ డా. టి.అక్కిరాజు , అధ్యాపకులు డా.సి.హెచ్.చైతన్య , డా.సి.హెచ్. అనురాధ , షేక్ పర్వీన్ , విద్యార్థిని మనోజ్ఞ మంజ్రేశ్వరి తదితరులు మాట్లాడారు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అతిధుల చేతులమీదుగా బహుమతులను అందజేశారు!

అతిథులను కళాశాల తరపున సత్కరించారు!

డి.సోమసుందర్,
సీనియర్ పాత్రికేయుడు,
08-03-2023,